సీ ఎం జగన్ పై జేసీ కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: సీఎం జగన్ పై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూర్ఖత్వం వల్లే జగన్‌ ఆనాడు కాంగ్రెస్‌ పార్టీకి దూరమయ్యారని దివాకర్‌రెడ్డి అన్నారు. నరసరావుపేట తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మళ్లీ అదే మూర్ఖత్వంతో నేడు సీఎంగా పతనమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఒకరిపై ద్వేషంతో కులం, ప్రాంతాల మధ్య జగన్‌ చిచ్చు పెట్టారని ఆరోపించారు. మనిషికి తల ఎలాంటిదో రాష్ట్రానికి రాజధాని కూడా అలాంటిదని అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉందని ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని జేసీ అన్నారు. సీఎం ఒకటి కాదు పది క్యాంప్‌ ఆఫీసులు పెట్టుకోవచ్చని, పరిపాలన మాత్రం అమరావతి నుంచే జరగాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు తప్ప సామాన్యులకు అసెంబ్లీ పనికిరాదన్నారు. ఈ నెల 23న రాయలసీమ ప్రజలను పిలిచి చర్చ జరపాలని సూచించారు. లేకుంటే కడపను రాజధాని చేయాలని తామంతా డిమాండ్‌ చేస్తామన్నారు.