విదేశాల్లలో మారుమ్రోగుతున్న”అమరావతి” నినాదాలు..రోజురోజుకు పెరుగుతున్న “ఎన్నారై” ల మద్దతు..!

వాస్తవం ప్రతినిధి : ఏపీకి మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైతే జగన్ అన్నారో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటున్న విపక్ష పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో జగన్ నిర్ణయం పై మండిపడ్డారు. ఇదే తరుణంలో అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు కూడా తీవ్ర స్థాయిలో వైసిపి పార్టీ నేతలపై జగన్ పై తీవ్ర విమర్శలు, ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. మొదట భూములు ఇచ్చిన రైతులతో మొదలైన ఈ ఉద్యమం మెల్లగా పరిసర జిల్లాలకు, తర్వాత రాష్ట్రాలకు, ఆ తరువాత దేశాలకు మొత్తం విస్తరించింది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ నెలరోజులుగా ఉద్యమిస్తున్న రాజధాని రైతులకు ప్రవాసుల నుంచి మద్దతు లభిస్తోంది. బహ్రెయిన్‌లోని కార్ల్‌టన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన సంఘీభావ సమావేశంలో ప్రవాసాంధ్రులు రాజధాని రైతులకు బాసటగా ‘అమరావతి’ గళాన్ని వినిపించారు. ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’, ‘ఒక రాష్ట్రం.. ఒక రాజధాని’, ‘జై అమరావతి.. జై ఆంధ్రప్రదేశ్’ వంటి నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారు మ్రోగించారు. ఈ కార్యక్రమంలో రఘునాధ్‌బాబు, హరిబాబు, ఆర్‌వీరావు, వాసుదేవరావు, జగదీశ్‌, సురేంద్ర, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.