ప్రవాసులు సందడే సందడి.. అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు!

 వాస్తవం ప్రతినిధి : ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అంటూ ఖండాంతరాలు దాటినను ఇతర దేశాల్లలో వున్న తెలుగు వారందరు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ ప్రతి యేటా సంక్రాంతి పండుగ ను ఘనంగా జరుపుకుంటారు. తెలుగువాళ్లు ఎక్కడున్నా.. మన సంప్రదాయాలను మరచిపోరని ప్రతి యేటా నిరూపిస్తూనే ఉన్నారు. సప్త సముద్రాలు దాటి వెళ్లినా.. సంప్రదాయానికి వారు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది వారు నిర్వహించే సంక్రాంతి సంబరాల్లోనే తెలిసిపోతుంది. సంక్రాంతికి ఇంకా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్థామా..? వద్దా..? పండుగ కొసం అంతదూరం వెళ్లలా అని ఆలోచించేవాళ్లు చాలా మందే ఉంటారు అనడంలో సందేహం లేదు. కాని దేశవిదేశల్లలో ఉన్న మన తెలుగువారు సంక్రాంతి పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. హాంగ్ కాంగ్‌లోని తెలుగు వారు సంక్రాంతి పండుగను ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. ముందుగా తెలుగు సాంస్కృతికోత్సవంలో భాగంగా కూచిపూడి, భరతనాట్యం, కథక్ వంటి సాంస్కృతిక నృత్యాలను చిన్నారులు ప్రదర్శించడం ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని బాగా అలరించాయి. తెలుగు సామెతలు, శ్లోకాలు, పద్యాలను చిన్నారులు ముద్దు ముద్దుగా చెబుతుంటే అందరి హృదయాలు ఆనందంగా కరతాళ ధ్వనులతో సందడి చేశాయి. చిన్ని నృత్య నాటిక “లవ-కుశ”లో పిల్లల వస్త్రధారణ, మేకప్, వారి విల్లు-బాణం ప్రేక్షకులను మైమరిపించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులు ఇంటికి దూరంగా ఉన్న కొంత బెంగ తీరిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.