అమరావతి రైతులకు చంద్రబాబు కంటే గట్టిగానే బెనిఫిట్స్ ఇస్తామంటున్న ఏపీ మంత్రి..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల హైపవర్ కమిటీ భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి ప్రాంత రైతులకు పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మవద్దు అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్థంతో అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతి రైతులెవరూ అధైర్య పడొద్దన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ కన్నా మెరుగైనది రైతులుకు ఇస్తామని ఆయన అన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ పూర్తిచేస్తామని చెప్పారు. అమరావతిలో నిర్మించిన అన్ని భవనాలను ఉపయోగించుకుంటామని తెలిపారు. అమరావతిపై చంద్రబాబు అఖిలపక్షం అభిప్రాయం కోరలేదని గుర్తుచేశారు. 13 జిల్లాలతోపాటు అమరావతి ప్రాంతాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఉనికి కాపాడుకోవడం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని బొత్స అన్నారు.