మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు : అట్లాంటా ప్రవాసాంధ్రులు

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో అమరావతి రగడ రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి చెప్పిన తరువాత నుంచే ఈ విషయంలో రగడ జరగడం మొదలైంది. అమరావతి రైతులు, ప్రజలు రోడ్డుపైకి వచ్చి రాజధానిని అక్కడి నుంచి మార్చవద్దని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అమరావతి రైతులు ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న నిరసనలు తారాస్ధాయికి చేరుకున్నాయి. మొదట భూములు ఇచ్చిన రైతులతో మొదలైన ఈ ఉద్యమం మెల్లగా పరిసర జిల్లాలకు , తర్వాత రాష్ట్రాలకు, ఆ తరువాత దేశాలకు మొత్తం విస్తరించింది. ఒక రాష్ట్రంలోనే కాదు ప్రముఖ ఎన్నారైలు జన్మభూమి కోసం తమ పనులు మానుకుని వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకి మద్దతుగా ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీ క్రిష్ణ విలాస్ లో సుమారు 250 మందికిపైగా సమావేశమయ్యారు. అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానికి సంబంధించిన 29 గ్రామాల రైతులపై ముఖ్యంగా మహిళలపై వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు, పిల్లలూ పాల్గొనడం గర్వించదగిన విషయం. అందరూ ర్యాలీగా వెళ్లి వైసీపీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’, ‘ఒక రాష్ట్రం.. ఒక రాజధాని’, ‘జై అమరావతి.. జై ఆంధ్రప్రదేశ్’ వంటి నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారు మ్రోగించారు.