‘ఇంకోసారి ఇలాంటి దాడులు జరిగితే మేం చేతులు కట్టుకొని కూర్చోబోం’: పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన బస చేసిన హెలికాన్ టైమ్స్ హోటల్ వద్దకు భారీ సంఖ్యలో జనసేన, వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఇరువర్గాలు తమ పార్టీలకు మద్దతుగా పోటీపడి నినాదాలు చేశాయి. అప్పటికే ఆ ప్రాంతంలో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఇరువర్గాలను నియంత్రించే ప్రయత్నం చేశారు. రోడ్డును క్లియర్ చేయడంతో పవన్ వాహనం హోటల్ వద్దకు చేరుకుంది. అంతకు ముందు… వైసీపీ శ్రేణులు దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ పరామర్శించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు.

తమవైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకున్నా వైకాపా నేతలు దూషించి దాడి చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.  వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కారణం లేకుండా తమపై దాడికి పాల్పడితే పోలీసు శాఖ చోద్యం చూడటం బాధ కలిగించిందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

నిరసనలు తెలిపే హక్కు తమకూ ఉందన్నారు. ఘటనకు బాధ్యుడిగా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదు చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. తాము శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే మీరెవరూ ఉండలేరని వ్యాఖ్యానించారు. ‘ఇంకోసారి జనసేన కార్యకర్తలపై ఇలాంటి దాడులు జరిగితే మేం చేతులు కట్టుకొని కూర్చోబోం’ అని హెచ్చరించారు. తాము చాలా బాధ్యతగా రాజకీయాలు చేస్తున్నామని చెప్పారు.