కాకినాడలో పర్యటిస్తున్న జనసేనాని..భారీ సంఖ్యలో పోలీసు బలగాల మొహరింపు

వాస్తవం ప్రతినిధి: జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు చేసిన దాడులలో గాయపడిన జనసేన కార్యకర్తలను జనసేనాని పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, నగరంలో 144 సెక్షన్ ను విధించారు. మరోవైపు, విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో కాకినాడకు వస్తున్న పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పవన్ పర్యటనను అడ్డుకోబోమని, ఆయనను అరెస్ట్ చేయబోమని జిల్లా ఎస్పీ నయీం హస్మీ ప్రకటించినప్పటికీ… పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

అలాగే ఎటువంటి ప్రదర్శనలు, ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలు, ధర్నాలకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు, తమ పార్టీ అధినేత కోసం జనసేన నేతలంతా తరలివస్తున్నారు. దీంతో కాకినాడ వ్యాప్తంగా గట్టిబందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు.

ఇటీవల పవన్ కళ్యాణ్‌పై వైకాపా నేత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన ఇంటిని ముట్టడించేందుకు జనసైనికులు బయలుదేరారు. అయితే, వైకాపా శ్రేణులు తిరగబడి జనసైనికులపై రాళ్ళదాడి చేశారు. ఈ దాడిలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని పరామర్శించేందుకు పవన్ ఈ రోజు కాకినాడకు చేరుకొన్నారు.