మూడు రాజధానుల కు జై కొట్టిన కెసిఆర్..??

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెరపైకి తీసుకువచ్చిన మూడు రాజధానులు నిర్ణయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జై కొట్టి సమర్థించినట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. వికేంద్రీకరణ నిర్ణయం చాలా మంచి నిర్ణయమని కెసిఆర్ అభిప్రాయపడినట్లు కధనాలు చెబుతున్నాయి.కెసిఆర్, జగన్ ల భేటీలో ఆ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు…అభివృద్ధి వికేంద్రీకరణతో ఇప్పటికిప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో సత్ఫలితాలు వస్తాయని కెసిఆర్ అన్నట్లు సమాచారం. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం రాష్ట్ర విభజన ఆలస్యానికి ప్రధాన కారణమైంది. అప్పట్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు కూడా హైదరాబాద్‌ స్థాయిలో కొంతైనా అభివృద్ధి చెంది ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో వచ్చేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు, మండలాలు, మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ద్వారా అధికార వికేంద్రీకరణ చేశామని తెలిపారు. దీంతో, సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే, తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారని సమాచారం.