అమరావతి విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి విషయంలో గత అసెంబ్లీ సమావేశాలలో వైయస్ జగన్ చేసిన మూడు రాజధానుల కామెంట్ల పై తీవ్ర స్థాయిలో ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఆందోళనలు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ప్రజల భయాందోళనలు తొలగించే విధంగా ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే అమరావతి నగరపాలక సంస్థ పేరుతో ఎపి ప్రభుత్వం కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది. రాజదానిగా పరిగణించే తుళ్లూరు మండలంలోని 18 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలోని 20 గ్రామాలు, తాడేపల్లి మండలంలోని రెండు రెవెన్యు, పంచాయతీ గ్రామాలు, మంగళగిరి మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలు, 4 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 9 గ్రామాలను కలిపి అమరావతి రాజధాని నగరం పేరుతో మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ప్రతిపాదనలు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే జిల్లాలోని ఆయా మున్సిపాల్టీల సమీపంలో ఉన్న గ్రామాలను కూడా వాటిలో కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చారు.దీనివల్ల అమరావతి ప్రాంతానికి ఒక హోదా వచ్చి, భూముల విలువలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో జగన్ సర్కార్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వినపడుతున్నాయి.