ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్..

వాస్తవం ప్రతినిధి: నిర్మల్ జిల్లా భైంసాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘర్షణలో రెచ్చిపోయిన ఇరువర్గాల వారు ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా వారిపై దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఇక పోలీసులు గాయాల పాలు కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేశారు. గాయపడిన వారిలో నిర్మల్ ఎస్పీ శశిదాహర్ రాజు, డీఎస్పీ నర్సింగ్ రావు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్ రావు ఉన్నారు. ఈ నేపథ‌్యంలోనే హైదరాబాద్ గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఛలో భైంసాకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయనని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఇంటి నుంచి ఆ‍యనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. నిన్న రాత్రి నుంచే ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.