ఏపీ రాజధాని రైతుల దీక్షకు వంగవీటి రాధా సంఘీభావం

వాస్తవం ప్రతినిధి:  ఏపీ రాజధాని రైతుల దీక్షకు బెజవాడ రాజకీయ నేత వంగవీటి రాధా సంఘీభావం ప్రకటించారు. తుళ్లూరు వచ్చిన ఆయన ఈ సందర్భంగా తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ వాళ్లు మూడు కాకపోతే ముప్పై రాజధానులు అంటూ వ్యాఖ్యానిస్తున్నారని, కానీ తమకు తెలిసి ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని అని ఉద్ఘాటించారు.

ఏ జిల్లాలో అయితే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారో అదే జిల్లాకు జగన్ సమస్యలు సృష్టించారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం సీఎంతో భేటీకి సమయం ఉంటుంది కానీ, రాజధాని రైతులను కలిసేందుకు సమయం ఉండదా? అంటూ నిలదీశారు. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచేలా అమరావతి రైతులు త్యాగాలు చేశారని రాధా కొనియాడారు.

ఇప్పుడు రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు కులాలు ఆపాదించడం సబబు కాదని హితవు పలికారు. తామంతా రైతుల నాయకత్వంలోనే ముందుకెళతామని ఈ టీడీపీ నేత స్పష్టం చేశారు.