మహిళలపై అలా చేయ్యడం తప్పు : ప్రవాస భారతీయులు

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో అమరావతి రగడ రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి చెప్పిన తరువాత నుంచే ఈ విషయంలో రగడ జరగడం మొదలైంది. అమరావతి రైతులు, ప్రజలు రోడ్డుపైకి వచ్చి రాజధానిని అక్కడి నుంచి మార్చవద్దని చెప్పి ఆందోళన చేస్తున్నారు. అమరావతి రైతులు ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న నిరసనలు తారాస్ధాయికి చేరుకున్నాయి. మొదట భూములు ఇచ్చిన రైతులతో మొదలైన ఈ ఉద్యమం మెల్లగా పరిసర జిల్లాలకు , తర్వాత రాష్ట్రం మొత్తం విస్తరించింది. ఒక రాష్ట్రంలోనే కాదు ప్రముఖ ఎన్నారైలు జన్మభూమి కోసం తమ పనులు మానుకుని వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ నిరసన తెలుపుతున్న ప్రజలపై పోలీసులు శనివారం లాఠీఛార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులకు అమెరికాలోని తెలుగు ప్రవాసులు తమ సంఘీభావం ప్రకటించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయ లబ్ధికోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దన్ని, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.