నాసా మూన్ మిషన్‌లో భారత సంతతి అమెరికన్ కు చోటు

వాస్తవం ప్రతినిధి: నాసా భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాల కోసం శిక్షణ ఇచ్చిన వారిలో ఓ భారత సంతతి అమెరికన్​ చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు నాసా 11 మంది వ్యోమగాముల బృందానికి శిక్షణ ఇస్తున్నది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన రాజా చారి ఎంపికయ్యారు. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో రెండేండ్ల శిక్షణ అనంతరం ఆయన గ్రాడ్యుయేషన్‌ పట్టాను పొందారు. శిక్షణ విజయ వంతమైనందుకు చిహ్నంగా రాజా చారి నాసా నుంచి సిల్వర్‌పిన్‌ లను పొందారు.
ఆపైన అంత రిక్షంలో ప్రవేశం అనంతరం బంగారు పిన్‌లను ఇవ్వటం నాసా సంప్రదాయం.

వ్యోమగామిగా మారడం 42 సంవత్సరాల రాజా చిన్ననాటి కల. పదకొండేళ్ల వయసులో స్కూల్లో వ్యోమగామి బొమ్మను గీయమని టీచర్ చెప్పినప్పుడు వ్యోమగామి బొమ్మకు తన తలను అంటించిన రాజా అప్పట్నుంచే ఎలాగైనా సరే అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటూ వచ్చారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు రాజా. 1950లో ఉస్మానియాలో ఇంజినీరింగ్ చేసిన రాజా తండ్రి శ్రీనివాస్ చారి ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికా వైమానిక దళంలో కల్నల్‌గా పనిచేశారు. ఆయన తండ్రి యుక్త వయస్సులోనే హైదరాబాద్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈ రెండేళ్ల శిక్షణ కోసం 2017లో దాదాపు 18వేల మంది పోటీ పడ్డారు. 2024 నాటికి చంద్రుడి ఉపరితలంపై మొదట మహిళను తర్వాత పురుషుడిని పంపాలని నాసా యోచిస్తోంది.