‘సరిలేరు నీకెవ్వరు ‘ మూవీ రివ్యూ: 

రేటింగ్: 2.5/5

తెలుగు ప్రేక్షక లోకంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో మహేష్ బాబు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ని యూత్ ని అట్రాక్ట్ చేయడంలో మహేష్ బాబు ఎప్పటినుంచో సక్సెస్ అవుతూ వస్తున్నారు. రీసెంట్ గా వస్తున్నటువంటి అతని సినిమాలు అన్ని ఒకేలాగా ఉంటున్నాయి అనే ఆరోపణ ఉంది .. శ్రీమంతుడు , మహర్షి , భరత్ అనే నేను ఇలా అన్ని రకాల ఒకేలాగా కనిపిస్తున్నాయి అనే ఫీలింగ్లో జనాలందరూ ఉన్నటువంటి టైంలో అనిల్ రావిపూడి తో ఒక మాస్ మసాలా సినిమాని మహేష్ బాబు తీసుకొచ్చాడు .. అదే సరిలేరు నీకెవ్వరు చిత్రం . ట్రైలర్ దగ్గర నుంచి పాటల వరకు ఆకట్టుకున్న ఈ చిత్రం, చిరంజీవి సపోర్టుతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చి ఈ సినిమాకి సపోర్ట్ చేయడంతో హైప్ ఇంకా పెరిగింది . అయితే థియేటర్లలో ఈ సినిమా ఎంత వరకు అంచనాల్ని అందుకుంటుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ..

కథ – విశ్లేషణ పాజిటివ్ లు :

మిలిటరీ లో తెగువ చూపించే ఆఫీసర్ గా ఉండే అజయ్ – మహేశ్ బాబు అతని కొలీగ్ అజయ్ – సత్యదేవ్ (ఇద్దరి పేర్లూ అజయ్) కోసం ఏం చేశాడు అనేది ఈ సినిమా. దేశం అంటే ప్రాణం ఇచ్చేటువంటి ఒక మిలటరీ ఆఫీసర్ ఉన్నట్టుండి కర్నూలు వెళ్తాడు అనేది కథలో భాగంగా సాగుతుంది .. అంత హడావిడిగా అతను కర్నూలు రావడం వెనుక గల కారణాలు ఏమిటి ? వచ్చిన తర్వాత అతని టార్గెట్ ఎలా సెట్ చేసుకున్నాడు ? దాన్ని ఎలా రీచ్ అయ్యాడు? ఈ మధ్యలో విజయశాంతితో అతను ఎలా దగ్గరయ్యాడు? అతని కొలీగ్ అజయ్ ( సత్యదేవ్) తల్లి ఐన విజయశాంతి కోసం హీరో ఏంచేశాడు? అతను ఇష్టపడినటువంటి అమ్మాయి అతన్ని దక్కించుకోగలిగిందా? ఆమె కుటుంబాన్ని హీరో ఎలా డీల్ చేశాడు ? ఇవన్నీ థియేటర్లో చూడాల్సిందే .. కథ మాత్రం మనం ఎప్పటి నుంచో చూస్తున్న తెలుగు సినిమా కథల మాదిరిగానే ఉంటుంది .. అయితే దీన్ని అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ కామెడీతో ఆకట్టుకునేలా గా తీయడంలో సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ ఫస్ట్ హాఫ్ వరకే సాగింది . ముఖ్యంగా విజయశాంతి – మహేష్ బాబు – ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రమే సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇంటర్వల్ బ్లాక్ హై లైట్ గా నిలిచింది .. సెకండ్ హాఫ్ చాలా చోట్ల నీరసంగా సాగుతున్న టైమ్ లో మైండ్ బ్లాక్ పాట ఊపు తెప్పిస్తుంది . . మహేష్ బాబు క్యారెక్టర్ ని హైలెట్ చేసి చూపించడంలో అనిల్ సక్సెస్ అయ్యాడు, ఖలేజా తర్వాత మహేష్ నుంచి ఆ రేంజ్ లో కామెడీ వచ్చింది అని చెప్పొచ్చు. రష్మిక దగ్గర ఒకలాగా విజయశాంతి క్యారెక్టర్ దగ్గర మరొక లాగా ప్రకాష్ రాజ్ దగ్గర మరొకలా .. మహేష్ బాబు మంచి గా నటించాడు. జబర్దస్త్ కి బాగా అలవాటుపడ్డ తెలుగు జనాలకి ఈ సినిమా లో ఓవర్ యాక్షన్ కామెడీ బాగానే నచ్చుతుంది . కొన్ని కొన్ని ఎపిసోడ్ లు పర్ఫెక్ట్ గా కమర్షియల్ హంగులతో రాసుకున్నాడు అనిల్ ..

నెగెటివ్ లు : 

చాలా తేలికపాటి కథ తో ఓవర్ ఎలివేషన్ లు రాసేసుకున్న అనిల్ రావిపూడి .. హీరో ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్ధం కాని ఒక కన్ఫ్యూజన్ లో ప్రేక్షకులని పడేశాడు . దేవీ శ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం తేలిపోయింది . సాంకేతికపరంగా సినిమా ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి . రష్మిక కారెక్టర్ ఒక పరిధి దాటిన తరవాత కాస్త విసుగు తెప్పిస్తుంది. సంగీత – హరితేజ కూడా అంతే . రాజేంద్ర ప్రసాద్ లాంటి అద్భుతమైన నటుడిని లిమిట్ చెయ్యడం దారుణమైన విషయం . విజయశాంతి రీ ఎంట్రీ కోసం థియేటర్ లకి వెళ్ళేవాళ్లని నిరాశ తప్పదు , ఆమె కారెక్టర్ అనుకున్నదానికంటే తక్కువగానే ఉంది .. ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయం లో కూడా టీం కాంప్రమైజ్ అయినట్టు కనిపించారు. వీటికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. అలాగే చాల కీలకమైన సన్నివేశాలను కూడా దర్శకుడు చాలా సినిమాటిక్ గా చూపించాడు. దీనికి తోడు కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సాగ తీత సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది. క్లైమాక్స్ లో ఫైట్ కూడా లేకుండా మాస్ ప్రేక్షకులని విసిగించాడు .

మొత్తంగా :

మొత్తంగా సంక్రాంతి ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని గతేడాది F2 తీసిన అనిల్ రావిపూడి కామెడీ బేస్ లో స్టార్ హీరో ని లాక్కొచ్చి ఫస్ట్ హాఫ్ వరకూ సక్సెస్ అయ్యాడు .. సెకండ్ హాఫ్ విషయం లో చాలా లోటు పాట్లు ఉన్నాయి. గ్రాఫ్ పెరుగుతూ పడిపోతూ సాగుతుంది … కామెడీ ని ఇష్టపడి థియేటర్ లకి వచ్చే ఫామిలీ ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ వరకూ పండగే .. కమర్షియల్ గా మహేశ్ కెరీర్ లో స్ట్రాంగ్ గా వెళ్ళడం కష్టమే . 104 కోట్ల షేర్ వస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించగలదు – ఆ రేంజ్ లో కలక్ట్ చేయడం ఈ కంటెంట్ తో కష్టమే అయితే సంక్రాంతి సీజన్ కావడం సినిమా కి హెల్ప్ చెయ్యాలి !!

పాంచజన్య