బాలయ్య – జూనియర్ ల సంగతేంటి టీడీపీ తమ్ముళ్లూ?

వాస్తవం ప్రతినిధి: చివరికి సినీ హీరోలు తరఫునుండి రాజధాని విషయంపై ఒక కథానాయకుడు స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న హీరో నారా రోహిత్ రాజధాని రైతులకు తన సంఘీభావం తెలిపారు. నిన్న మహేష్ బాబు ఇంటి వద్ద కొంతమంది రాజధాని విషయంపై స్పందించాలని నానా రభస చేసిన విషయం కూడా తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి అయితే జగన్ సర్కార్ అభివృద్ధి వికేంద్రీకరణ సమర్థిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా వదిలాడు.

ఈ నేపథ్యంలో నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలతో నందమూరి హీరోల పై అందరి దృష్టి పడింది. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే అయినా కూడా అసలు తనకూ రాజకీయాలకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుంటాడు. 23 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా, కనీసం నోరు తెరిచిన పాపాన పోలేదు. అసలు అతను ఎందుకు ఇంకా వారి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు అని పార్టీలోని ఇతర నేతలకే అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఇకపోతే మరో యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో పార్టీ వైపు ప్రచారం చేసినా తర్వాత టిడిపి ఓటమికి అతనిని బలి పశువుని చేశారని విభేదాలు వచ్చి పార్టీ నుంచి విడిపోయారు. తండ్రి హ‌రికృష్ణ చ‌నిపోయిన సంద‌ర్భంలో చంద్ర‌బాబుతో క‌ల‌వ‌డం త‌ప్ప‌, మ‌రెప్పుడూ వారితో క‌లిసిన దాఖ‌లాలు లేవు. 2018లో సొంత అక్క సుహాసిని కూక‌ట్‌ప‌ల్లి నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసినా…క‌నీసం అటువైపు కూడా తొంగి చూడ‌లేదు.

అసలు చంద్రబాబు తర్వాత పార్టీ భవిష్యత్తు ఏమిటనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఇలా మౌనంగా ఉంటే ఇక తెలుగుదేశం కొన్నేళ్ళకి రాష్ట్రంలో మూట ముల్లె సర్దేసుకోవచ్చు.