అమెరికాలో ఎన్నారై మహిళా జడ్జిలకు అరుదైన గౌరవం

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం అమెరికాలో ఇద్దరు భారత సంతతి మహిళా న్యాయవాదులకు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని క్రిమినల్, సివిల్ కోర్టులకు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. న్యూయార్క్‌ క్రిమినల్ కోర్టు జడ్జిగా అర్చన రావు, సివిల్ కోర్టు జడ్జిగా అంబేకర్‌ను నియమిస్తూ న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డే బ్లాసియో ఉత్తర్వులు జారీ చేశారు. అర్చన రావు 2019 జనవరిలో సివిల్ కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పని చేశారు. తాజాగా క్రిమినల్ కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆమె న్యూయార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో 17 సంవత్సరాలు పనిచేశారు. అంతేగాక ఆమె ఇటీవల ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ బ్యూరో చీఫ్‌గా కూడా విధులు నిర్వహించారు. ఇక అంబేకర్ 2018, మేలో మొదట సివిల్ కోర్టులో తాత్కాలిక జడ్జిగా పనిచేసి ఆ తర్వాత క్రిమినల్ కోర్టుకు మారారు. అంతేకాకుండా క్రిమినల్ డిఫెన్స్ డివిజన్‌లోని లీగల్ ఎయిడ్ సొసైటీలో స్టాఫ్ అటార్నీగానూ వ్యవహరించారు. కాగా ఫ్యామిలీ కోర్టు, క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టులకు న్యూయార్క్ మేయర్ మొత్తం 28 మందిని న్యాయమూర్తులుగా నియమించారు.