ఇక వారంలో మూడు రోజులు సెలవులు.. ప్రధాని సంచలన నిర్ణయం..!!

వాస్తవం ప్రతినిధి: వారమంతా పనిచేస్తే ఒక్క రోజు సెలవు దొరుకుతుంది. కాస్త విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఏదైనా పని పడితే అది కూడా హుష్ కాకి. ఐటీ ఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థల్లో మాత్రమే వారానికి రెండు రోజుల సెలవు దొరుకుతోంది. మిగతావారంతా 6 రోజులు పని చేయాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ఫిన్‌లాండ్ ప్రధానిగా ఎన్నికైన సనా మారిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వారానికి ఐదు రోజుల పనిదినాలను నాలుగు రోజులకు కుదిస్తానని ఫిన్‌లాండ్‌ ప్రధాన మంత్రి సన్నా మేరిన్‌ సోమవారం ప్రకటించారు. అంతేకాదు, పని గంటలు కూడా రోజుకు ఆరు గంటలు మాత్రమే ఉండేలా ఆమె నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ప్రజలు తాము ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం సమయం కేటాయించేందుకు అర్హులు. దీన్ని ఒక సాంప్రదాయంలా పాటించాలి. మన ఉద్యోగ జీవితంలో ఇది మరో ముందడుగు కావాలి” అని తెలిపారు. ప్రధాని నిర్ణయంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పనిదినాలు తగ్గించటం వలన ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేయగలరని, తక్కువ పని ఒత్తిడి వల్ల ఉద్యోగులల్లో సంతృప్తి పెరుగుతుందని వివిధ అధ్యయనాలు, సర్వేలు కూడా చెబుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు.