నేను విహారయాత్రకు వెళ్లటం తప్పే: ఆస్ట్రేలియా ప్రధాని

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు న్యూ సౌత్ వేల్స్ రాష్ర్ట ప్రజలను వణికిస్తున్నది. మంటలు అదుపు తప్పడంతో ఆ రాష్ర్ట ప్రభుత్వం ఏడు రోజులపాటు అత్యయిక స్థితిని విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని సిడ్నీతో పాటు పలు ప్రాంతాల్లో చెలరేగిన దాదాపు 100 కార్చిచ్చులతో జనావాసాలు పొగతో నిండిపోయాయి. అయితే ఈ కార్చిచ్చు వ్యవహారంతో ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ విమర్శలు ఎదురుకుంటున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు విస్తరిస్తున్న కార్చిచ్చుతో సతమతమవుతున్న సమయంలో తాను విహార యాత్రలకు వెళ్లటంపై వచ్చిన విమర్శలకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ క్షమాపణలు చెప్పారు. హవాయి దీవుల్లో విహార యాత్రకు కుటుంబ సమేతంగా వెళ్లిన ప్రధాని మారిసన్‌ ఆదివారం తన కార్యక్రమాలను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశానికి వచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలు విపత్తులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో తాను విహారయాత్రకు వెళ్లటం తప్పేనని అంగీకరించారు. ప్రస్తుత కార్చిచ్చు విస్తరణకు అనేక కారణాలున్నాయని, ఇందుకు ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో వేడిగాలులు వీస్తుండటం ప్రధాన కారణమని వివరించారు.