యుపి లో అరాచకం..కోర్టులో కాల్పులు..బల్లల కింద దాక్కున్న జడ్జి, న్యాయవాదులు

వాస్తవం ప్రతినిధి: ఓ హత్య కేసులో నిందితుడిని కోర్టు హాల్ లోనే కాల్చివేసిన సంఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్ లో జరిగింది. కోర్టు ప్రాంగణంలో జడ్జి చూస్తుండగానే దుండగులు నిందితుడ్ని కాల్చి చంపారు. దుండగులు కాల్పులు జరపడంతో జడ్జి సహా, న్యాయవాదులు, ఇతర సిబ్బంది బల్లల కింద దాక్కున్నారు. వివరాల ప్రకారం..

షా నవాజ్ అన్సారీ డబుల్ మర్డర్ కేసులో నిందితుడు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న అతనిని సోమవారం బిజ్నోర్ లోని చీఫ్‌ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు తీసుకొచ్చారు. కోర్టు విచారణ జరుగుతుండగానే అప్పటికే కోర్టులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పిస్తోల్లు తీసి షా నవాజ్ అన్సారీపై కాల్పులు జరిపారు.

ఈ సందర్భంగా కోర్టులో భీతావహ వాతావరణం నెలకొంది. ఎవరు ఎవర్ని చంపుతున్నారో అర్థంకాకపోవడంతో జడ్జి, న్యాయవాదులు తమ బల్లలనే రక్షణ కవచాలుగా చేసుకుని ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో కాల్పులు జరిపిన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.