మహిళలు జాగ్రత్త..ట్రీట్‌మెంట్ ముసుగులో పాడు పని..భారత్ పరువు తీసిన డాక్టర్

వాస్తవం ప్రతినిధి: పవిత్ర వైద్యవృత్తి చేస్తున్నాడు… కానీ అతడి బుద్ధి మాత్రం నీచమైనది. ఇతర దేశాలకు వెళ్లి అక్కడ మనదేశం గర్వపడేలా కొందరు చేస్తుంటే… మరికొందరు మాత్రం పరాయి దేశంలో పాడు పనిచేసి దేశానికి అప్రతిష్టను మూటగడుతున్నారు. వైద్యం కోసం తన దగ్గరికి వచ్చే మహిళలను లైంగికంగా వేధించి వికృతంగా ప్రవర్తించాడు. క్యాన్సర్ భయాన్ని అవకాశంగా మలచుకుని వైద్య పరీక్షల పేరిట మహిళలపై శరీరాలతో ఆడుకున్న భారతీయ సంతతికి చెందిన ఒక డాక్టర్‌ను నేరస్తుడిగా బ్రిటన్ కోర్టు నిర్ధారించింది.

భారత్‌కు చెందిన మనీష్‌ షా అనే డాక్టర్‌ లండన్‌లో స్థిరపడ్డాడు. జనరల్‌ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న అతడి వద్దకు ఎంతో మంది మహిళలు వస్తుండేవారు. ఈ క్రమంలో సాధారణ చెకప్‌ కోసం వచ్చిన మహిళలకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ గురించి వివరించి, వ్యాధుల తీవ్రతను చెబుతూ వారిని భయభ్రాంతులకు గురిచేసి ఎలాగైనా పరీక్షలు చేయించుకునేలా వారిని ఒప్పించేవాడు. హాలీవుడ్ స్టార్ ఏంజెలీనా జోలీ క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పేవాడు. అలా అవసరం లేకపోయినా సదరు మహిళా పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆయన వద్దకు వచ్చే మహిళా పేషెంట్లను చికిత్స పేరుతో తాకరాని చోట తాకి చేతులు వేయరాని చోట వేసి పైశాచికత్వపు ఆనందాన్ని పొందేవాడు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2013లో వైద్యశాఖ ఉన్నతాధికారులు మెడికల్‌ ప్రాక్టీసు నుంచి అతడిని సస్పెండ్‌ చేశారు.

తూర్పు లండన్‌లోని మావ్నీ మెడికట్ సెంటర్‌లో జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న మనీష్ షా 2009-2013 మధ్య కాలంలో తన వద్దకు వచ్చిన ఆరుగురు మహిళలకు అవసరం లేనప్పటికీ రొమ్ము పరీక్షలు, మర్మాంగాల పరీక్షలు నిర్వహించాడని కోర్టు పేర్కొంది. వీరిలో ఒక 11 ఏళ్ల బాలిక కూడా ఉందని కోర్టు తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన కేసు మాత్రం నేటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం మనీష్‌ షా కేసు కోర్టు విచారణకు వచ్చింది. ఈ క్రమంలో అతడిని దోషిగా తేల్చిన కోర్టు..తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. ఇక షా మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు ఖండించాడు. తనకు ఏ పాపం తెలియదని పేర్కొన్నాడు.