బోరు బావిలో పడ్డ చిన్నారి..ఆగిపోయిన పాప అరుపులు..ఆనందంలో తండ్రి

వాస్తవం ప్రతినిధి: అదేమిటి..? పాప బోరు బావిలో పడిపోతే తండ్రి ఆనందంగా వుండడం ఏమిటి అనుకుంటున్నారా ? అయితే ఇది చదవండి మీకే తెలుస్తుంది. చైనా, హెనన్‌ రాష్ట్రంలోని జెన్‌ కౌంటీలో మిస్టర్‌ జావో అనే ఓ వ్యక్తి తన మూడేళ్ల పాపను ఓ ఫుడ్‌ కోర్టు పక్కనుంచి నడిపించుకుంటూ పోతుంటే తెరచి ఉన్న బోరు బావిలోకి పడిపోయింది. కళ్ల ముందు జరిగిన ప్రమాదాన్ని చూసిన ఆ తండ్రి, తన కూతురిని కాపాడమని కేకలు వేశారు. విషయం తెలుసుకున్న పోలిసులు హుటహుటిన సంఘటన స్ధలానికి వచ్చారు. వంద అడుగుల లోతుగల ఆ బోరు బావిలోకి ఆక్సిజన్‌ను పంపించడం మొదలు పెట్టారు. ఆ బాలికను ఎలా వెలికి తీయాలో పోలీసులకు తెలియలేదు. అంతలో ప్రమాద స్ధలానికి వచ్చిన వాంగ్‌ క్వింగ్‌జున్‌ అనే వ్యక్తి తన 14 ఏళ్ల కుమారుడైన వాంగ్‌మిన్‌ రన్‌ ఆ పాపను రక్షించగలడు అని పోలీసులకు చెప్పాడు. మైనర్‌ బాలుడి ప్రాణాలను రిస్క్‌లో పెట్టలేమని, అది నేరం అవుతుందని పోలీసులు వద్దన్నారు. తన కుమారుడు సమర్థుడు, సాహసవంతుడని, ఏ ప్రమాదం జరిగినా అందుకు తానే బాధ్యత వహిస్తానని ఆ తండ్రి హామీ ఇవ్వడం, అదే సమయంలో బోరు బావిలో పడిపోయిన పాప అరుపులు ఆగిపోవడంతో బాలుడి సహాయం తీసుకోవడానికి పోలీసులు ముందుకు వచ్చారు. మినరన్‌కు కొన్ని ముందు జాగ్రత్తలు చెప్పి తల కిందులుగా లోపలికి పంపించారు. లోపలికి వెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నించారు వాంగ్‌మిన్‌ రన్‌. నాలుగోసారి బాలుడిని పంపించినప్పుడు పాప చేయి బాలుడి చేతికందింది. అన్నా నన్ను కాపాడు అంటూ ఆ పాప వాంగ్‌మిన్‌ రన్‌ చేయి పట్టుకుంది. కాపాడడానికే వచ్చాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి, గుండెల నిండా ఆక్సిజన్‌ పీల్చుకోవడానికి మరోసారి బయటకు వచ్చాడు వాంగ్‌మిన్‌ రన్‌. ఆరో ప్రయత్నంలో ఆ పాపను బయటకు తీసుకురాగలిగాడు. పాప ప్రాణాలను కాపాడినందుకు ఎంతో అనందంగా ఉందన్నాడు జావో(పాప తండ్రి). పాప తండ్రి తో పాటు పోలీసులు, అక్కడున్న వారందరు ఆ బాలుడిని, ఆ బాలుడి తండ్రిని అభినందించారు.