ఏప్రిల్ 1 నుంచి హెచ్1-బీ వీసా దరఖాస్తులు స్వీకరణ

వాస్తవం ప్రతినిధి: 2021 సీజన్‌కు గాను హెచ్‌-1 బీ వీసా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముగింపు పలికింది అమెరికా. ఇక అమెరికాకు వెళ్లాలని భావించి హెచ్-1బీ వీసా కావాలనుకునే ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. ఇక అమెరికాలోని ఐటీ సంస్థల్లో అత్యధికంగా భారతీయులే పనిచేస్తుండటం విశేషం. ఇందుకోసం ముందుగా 10 అమెరికా డాలర్లను ఫీజుకింద చెల్లించాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల పేపర్ పని తగ్గుతుందని, దరఖాస్తుదారులకు కూడా డబ్బులు ఆదా అవుతుందని ఏజెన్సీ వెల్లడించింది. ఇక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కేవలం కంపెనీ దరఖాస్తుదారుడికి సంబంధించిన ప్రాథమిక సమాచారం పొందుపర్చాల్సి ఉంటుంది.

వచ్చే ఏడాది మార్చి 1 నుంచి మార్చి 20 వరకు రిజిస్ట్రేషన్ పిరియడ్ ఉంటుందని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. ఇందులో కొన్ని దరఖాస్తులు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందని వారు మాత్రమే హెచ్-1బీ వీసా కోసం పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఏడాదికి 65వేల వీసాలు మాత్రమే ప్రాసెస్ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ 1 బీ వీసా అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా, సాంకేతిక నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను నియమించుకోవడానికి యూఎస్‌ కంపెనీలకు ఆ ప్రభుత్వం ఇచ్చేఅనుమతి. ఈ వీసా కోసం ప్రతి ఏటా భారత్‌, చైనాల నుంచి పదివేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకుంటారు.