కేవలం ఎనిమిది పరుగులకే ఆలౌట్ అయిన మహిళా క్రికెట్ జట్టు

వాస్తవం ప్రతినిధి: మాల్దీవుల మహిళా క్రికెట్ జట్టు మరోసారి చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. 13వ దక్షిణాసియా క్రీడల్లో భాగంగా నేపాల్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మాల్దీవులు కేవలం ఎనిమిది పరుగులకే ఆలౌటైంది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. గత జూన్ నెలలో రువాండాపై ఆరు పరుగులు మాత్రమే చేసిన మాలి అత్యల్ప స్కోరును నమోదు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మాల్దీవుల జట్టు 11.3 ఓవర్లు ఆడి ఎనిమిది పరుగులు చేసింది. అందులో ఏడు ఎక్స్‌ట్రాల ద్వారానే రావడం విశేషం. ఓపెనర్ ఐమా ఐషత్ మాత్రమే ఒక్క పరుగు చేయగలిగింది. మాల్దీవుల కెప్టెన్ జూనా మరియమ్ 16 బంతులు ఆడినా.. ఖాతా తెరువలేకపోయింది. నేపాల్ బౌలర్లలో అంజలి చంద్ ఓ పరుగిచ్చి నాలుగు వికెట్లు తీసింది.