ఏపీలో పెరగనున్న ఆర్టీసీ చార్జీలు

వాస్తవం ప్రతినిధి: ఇటీవలే తెలంగాణలో ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే కాగా తాజాగా ఏపీలో కూడా ఆర్టీసీ చార్జీలు పెరగబోతున్నాయి. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచారు.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచక తప్పడం లేదని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానీ తెలిపారు.

2015 తరువాత ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. పెరుగుతున్న డీజిల్ ధరలు, జీతభత్యాలు కారణంగా నెలకు ఆర్టీసీపై రూ. 100 కోట్ల అదనపు భారం పడుతున్నది. మొత్తంగా ఆర్టీసీకి సంవత్సరానికి రూ. 1200 కోట్ల నష్టం వస్తున్నది. ఈ నష్టాలు తగ్గించాలి అంటే… చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ చార్జీల పెంపుతో కొంతవరకునష్టాలు నివారించవచ్చని అంటున్నారు. అయితే, పెంచిన చార్జీలు ఎప్పటి నుంచో అమలులోకి వస్తాయో ప్రకటిస్తామని పేర్ని నాని పేర్కొన్నారు.