మహిళల రక్షణకు కేంద్రం కీలక ఆదేశాలు!..2 నెలల వ్యవధి లోపే విచారణ?

వాస్తవం ప్రతినిధి: దిశ దుర్ఘటన దిశ దిశలా దేశాన్ని కుదిపేయడం, ఇటీవల కాలంలో మహిళలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతుండడంతో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మహిళలపై దాడుల విషయంలో అన్ని రాష్ట్రాలనూ కఠినంగా వ్యవహరించాల్సిందిగా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు పంపారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల కేసులను తీవ్రంగా పరిగణించాలని, వీటి విషయంలో అలసత్వం వహించకుండా 2 నెలల వ్యవధి లోపే విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అందులో సూచించారు. మహిళల రక్షణ అంశాన్ని రాష్ట్రాలు అత్యంత ప్రధాన అంశంగా తీసుకోవడమే కాకుండా, ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.