బీరు త్రాగితే ఆరోగ్యానికి మంచిది..ఆయుష్షు పెరుగుతుంది: పెటా

వాస్తవం ప్రతినిధి: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. రోజూ గ్లాసు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఇక సినిమాలు వచ్చే టైంలో ఓపెనింగ్ కూడా దీనికి సంబందించిన ప్రకటన వేస్తారు. మద్యపానం వలన ఇండియాలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. ‘పాలు తాగండి. ఆరోగ్యంగా ఉంటారు’… ప్రభుత్వ నినాదమిది. రోజూ లేవగానే ఒక గ్లాసుడు పాలు తాగాలని పిల్లలకు పెద్దలు కూడా చెబుతుంటారు. ఇప్పటివరకు ఇవన్నీ వైద్యులు, పెద్దలు చెప్పే ఆరోగ్య సూత్రాలు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. పాల కంటే బీరే ఆరోగ్యకరమట. పాలు తాగడం కంటే బీరు సేవించడమే మంచిదట. అదేంటి పాలు ఆరోగ్యానికి మంచిదని, అందులోని పోషకాలు పిల్లలకు ఉపయోగపడతాయని అనుకుంటుంటే బీరు తాగమని చెబుతున్నారేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవండి మీకే తెలుస్తుంది. గ్లాస్‌ పాల కంటే పెగ్గు బీర్‌ మంచిదట. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ఎవరో ఆషామాషీగా చెప్పిన విషయం కాదు. సాక్షాత్తూ జంతు సంరక్షణ సంస్థ పెటా ఈ ప్రకటన చేసింది. మనుషుల ఆరోగ్యానికి పాల కంటే రోజూ ఓ పెగ్గు బీరే బెటర్ అని పెటా చెబుతోంది. దీనిపై ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలు చేసి విడుదల చేసిన రిపోర్టు ఆధారంగా పెటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆరోగ్యం కోసం… పాలకంటే బీరే చాలా మంచిదని పెటా ఘంటాపథంగా చెబుతోంది. పాలకంటే బీరులో ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయని, డెయిరీ ఉత్పత్తుల వల్ల.. గుండె సంబంధిత వ్యాధులు, ఉబకాయం, మధుమేహం, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని వివరించింది. ఆవులు, గేదెల నుంచి పాలు తీయకూడదని, వాటి పిల్లలకి పాలు లేని పాపం చేయొద్దని పెటా చెబుతుంది. బీరుతో ఎముకలు ధృడంగా మారుతాయని..ఆయుష్షు పెరుగుతుందని తెలిపింది. అందుకే ప్రతి ఒక్కారు పాలకి బదులు బీరు తాగాలని సూచిస్తుంది. పెటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ట్రాకీ రేమన్ మాట్లాడుతూ.. మనం పాలు తాగడం కోసం కోట్లాది ఆవులు ఇబ్బంది పడుతున్నాయని, అదే బీరు తాగితే అలాంటి ఇబ్బందులు ఎదురవవని వెల్లడించారు.