మళ్లీ పుంజుకుంటున్న దశాబ్ద కాలపు వ్యాధి…ఏడాదిలో లక్షా 42 వేల మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: దాదాపు పూర్తిగా కనుమరుగై పోయిందనుకున్న దేశాల్లో కొంత కాలంగా తట్టు (పొంగు) లాంటి అంటు వ్యాధులు మళ్లీ విజృంభిస్తోంది. తట్టు (పొంగు) వ్యాధి కారణంగా 2018లో 1,42,300 మంది ప్రాణాలు కోల్పోయారు. డబ్ల్యూహెచ్‌ఓ ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన రోగనిరోధక విభాగం నిపుణులు అంటున్నారు. పేదరికంలో మగ్గుతున్న దేశాల్లోనే తట్టు ప్రభావం ఎక్కువగా ఉందన్ని, ప్రపంచంలోని తట్టు బాధితుల్లో సగం మంది లిబియా, మడగాస్కర్‌, సోమాలియా, ఉక్రెయిన్‌, కాంగోలో ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. సరైన సమయంలో టీకా వేయించడం ద్వారా తట్టును ఎదుర్కొనేందుకు వీలుంది. అయితే… టీకా ధరలు దాదాపు దశాబ్దకాలంగా ఏమాత్రం తగ్గకపోవడం ప్రతికూల ప్రభావం చూపుతోందని డబ్ల్యూహెచ్‌ఓ విశ్లేషించింది. వ్యాధి నివారణకు ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో కనీసం 95 శాతం మందికి టీకాలు వేయించాల్సి ఉంది. అయితే… 2018లో తట్టు నిరోధక టీకాల మొదటి డోస్‌ 86 శాతం, రెండో డోస్‌ 70 శాతం కంటే తక్కువ మంది చిన్నారులకు వేసినట్టు డబ్ల్యూహెచ్‌ఓ, యూనిసెఫ్‌ తెలిపాయి.