యూకేలో ప్రవాసభారతీయుడుకి జైలు శిక్ష

వాస్తవం ప్రతినిధి: యూకేలో ఉంటున్న ప్రవాస భారతీయుడు అభయ్ సింగ్ కి యూకే కోర్టు జైలు శిక్ష విధించింది. భారత సంతతికి చెందిన అభయ్ సింగ్ అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా సంపాదించిన ఆస్తులను దాచేందుకు ప్రయత్నించినందుకు యూకే కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో నేరాన్ని అంగీకరించడంతో బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు అతనికి మూడు సంవత్సరాల నాలుగు నెలల శిక్ష విధించింది.

ఈ ఏడాది ప్రారంభంలో మెట్రోపాలిటిన్ పోలీస్ సెంట్రల్ స్పెషలిస్ట్ క్రైమ్ యూనిట్ అధికారులు ఇతని వద్ద డ్రైవింగ్ లైసెన్సులు, బ్యాంక్ కార్డులు, నగదు పుస్తకాలు వంటి అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అభయ్ సింగ్ మోసపూరిత కుట్రపై నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన ఉస్మాన్ ఖాన్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతనితో పాటు ఈ కుట్రలో పాలు పంచుకున్న 56 ఏళ్ల నవీద్ పాషాకు కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. ఇది చాలా క్లిష్టమైన కేసు అని సైబర్ నేరం, మనీలాండరింగ్‌ కలగలసిన వ్యవహారమని నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి చెందిన సైబర్ క్రైమ్ యూనిట్ అధికారి ఫిల్ లారట్ తెలిపారు.