అమెరికా అధ్యక్ష రేసులో ఇండియన్ ఎన్నారై

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి కమలా హారిస్‌ తప్పుకున్న కొద్ది గంటలకే మరో భారతీయ అమెరికన్‌ పీటర్‌ మాథ్యూస్‌… ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ట్రంప్‌ స్వార్థ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతానని పీటర్‌ స్పష్టం చేశారు. అమెరికాలోని దిగువ సభలో 47వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి అధ్యక్ష రేసులో దిగుతున్నట్టు తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన నిబంధనలు సడలించడం, ధనికులు చెల్లించే పన్ను శాతంలో కోత విధించడం వల్ల దేశ ప్రజలు, పర్యావరణం నాశనమవు తోంది. ఈ విధానాన్ని మాజీ అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ మొదలు పెడితే.. ట్రంప్‌ ఇప్పటికీ కొనసాగిస్తు న్నారు’ అని పీటర్‌ అన్నారు.

మాథ్యూస్ భారత్‌లో జన్మించారు. ఆయన తండ్రి కేరళకు చెందిన వారు కాగా తల్లి తమిళనాడు మహిళ. మాథ్యూస్‌కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం భారత్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడింది. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన సైప్రైస్ కాలేజీలో పొలిటికల్ సైన్సెస్‌తో పాటు అంతర్జాతీయ సంబంధాల పై ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దీనితో పాటు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ టెలివిజన్‌లో పొలిటికల్ ఎనలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌లో సభ్యుడు అయినా కాకపోయినా తాను జాతి, సమానత్వం, లింగం, జాతి, మతం, వయస్సు ఆధారంగా చూపే వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతానని మాథ్యూస్ స్పష్టం చేశారు.