ఆస్ట్రేలియా స్కాలర్‌షిప్‌ను దక్కించుకున్న తెలంగాణ తొలి న్యాయ విద్యార్థి!

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్‌కు చెందిన శ్రాష్ట వాణి కొల్లి విదేశీ విద్యను ఉచితంగా సొంతం చేసుకుని సత్తాచాటింది. ఏకంగా 60 లక్షల రూపాయల ఆస్ట్రేలియా స్కాలర్‌షిప్‌ను దక్కించుకున్న తెలంగాణ తొలి న్యాయ విద్యార్థిగా వార్తల్లోకెక్కింది! శ్రాష్ట వాణి పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లో అయినా… బెంగుళూరులోని రేవా యూనివర్సిటీలో ‘లా’ సీటు రావడంతో అక్కడ చేరింది. ఆమె ఇప్పటికే రెండు సంవత్సరాల న్యాయ విద్య రేవా యూనివర్సిటీలో పూర్తి చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కోరిక ఉండడంతో ప్రతిష్టాత్మక ‘ఛేంజ్‌ ది వరల్డ్‌’ అనే స్కాలర్‌షిప్‌ గురించి బంధువు ద్వారా తెలుసుకోని.. తన కృషి, పట్టుదలతో ప్రతిష్టాత్మక ‘ఛేంజ్‌ ది వరల్డ్‌’ అనే ‘వలింగాంగ్‌’ యూనివర్సిటీ ఉపకార వేతనం సాధించింది. “నేను స్కాలర్‌షిప్ గెలిచానని గ్రహించిన క్షణం చాలా ఉత్సాహంగా ఉంది, మరియు నా అనుభూతిని వ్యక్తపరచలేకపోయాను” అని శ్రాష్ట వాణి చెప్పింది. ఈ స్కాలర్‌షిప్‌ బహూకరించడానికి ఆస్ట్రేలియా నుంచి స్వయంగా యూనివర్శిటీ పెద్దలు రావడం గొప్ప విషయమన్ని శ్రాష్ట వాణి చెప్పింది. బెంగుళూరులో రెండేళ్ల న్యాయ విద్య పూర్తయిపోయినందున్న మిగతా రెండేళ్ల న్యాయ విద్యను కొనసాగించడానికి శ్రాష్ట వాణికు ‘వలింగాంగ్‌’ యూనివర్సిటీ వెసులుబాటు కల్పించింది. ఆస్ట్రేలియాలో తన సమయం గురించి చాలా ఉత్సాహంగా ఉన్న శ్రాష్ట వాణి, వచ్చే ఏడాది మార్చిలో ఈ కోర్సులో చేరబోతున్నానని చెప్పారు. ఈ అవకాశాన్ని నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకుని, యూనివర్సిటీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానన్ని శ్రాష్ట వాణి చెప్పింది.