విరాట్ కోహ్లీపై బాలీవుడ్‌ మెగాస్టార్‌ ప్రశంసల వర్షం

వాస్తవం ప్రతినిధి: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 6 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో అజేయంగా 94 పరుగులతో నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీని ఔట్‌ చేసినప్పుడు విలియమ్స్‌ జేబులోంచి బుక్‌ తీసినట్లు చూపిస్తూ టిక్కు కొట్టి కవ్వించాడు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇలా చేసినట్లు మ్యాచ్‌ అనంతరం కోహ్లీ వెల్లడించాడు.

ఈ సందర్బంగా కోహ్లీ నోట్‌బుక్ సెలబ్రేషన్‌పై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో “విరాట్‌ను కవ్వించొద్దని ఎన్నో సార్లు చెప్పాను. కానీ వారు నా మాట వినలేదు. దీంతో కోహ్లీ చిట్టి రాసి వారి చేతిలో పెట్టాడు. చూడండి ఇప్పుడు.. వెస్టిండీస్‌ ప్లేయర్ల ముఖాలు ఎలా మాడిపోయాయో” అని ట్వీట్ చేశాడు.