ఉన్నావ్‌ ఘటన బాధితురాలు మృతి

వాస్తవం ప్రతినిధి: ఉన్నావ్‌ ఘటన బాధితురాలు మృతి చెందింది. ఢిల్లి సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన మహిళపై గత డిసెంబరులో కొందరు దుండగులు అత్యాచారం చేశారు. గురువారం ఆమె రాయ్ బరేలీలోని కోర్టుకు హాజరయ్యేందుకు బయలుదేరింది. ఆమెను కోర్టుకు వెళ్లకుండా నిలువరించేందుకు వీలుగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారు ఆమెను దారి మధ్యలో అటకాయించారు. తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను ఆమెపై పోసి నిప్పు పెట్టారు. మంటల్లో శరీరం కాలుతున్నా పట్టించుకోకుండా న్యాయం కోసం కిలోమీటరు పరిగెత్తిన ఆమె.. ఫోన్లో తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున కాలిపోయిన ఆమెను తొలుత లక్నో ఆసుపత్రికి తర్వాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. చికిత్స తీసుకుంటూనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారు. అంతకు ముందు బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.