పవన్ కి కౌంటర్ వేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి..!

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ సమక్షంలోనే వైసిపి నేతల తలకాయలు నరుకుతా అంటూ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన వైసిపి పార్టీ అధ్యక్షుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తల పవన్ కళ్యాణ్ గారు సిగ్నల్ ఇస్తే నరికి తెస్తానని చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.

దీంతో ఈ వ్యాఖ్యల పట్ల అనంతపురం వైసిపి పార్టీ అధ్యక్షుడు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా సాక్షిగా ఆయన భారీ కౌంటర్ వేశారు…”మా పెద్దాయన ఎప్పుడో చెప్పాడు, తొడలు కొట్టడం మాకు రాదు, మీసాలు తిప్పడం మాకు తెలీదు, మాకు తెలిసినది ఆకలి అన్న వాడికి అన్నం పెట్టడం , కష్టాల్లో ఉన్నవాడికి తోడుగా నిలవడం.. అలాగే దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో , ఇప్పటివరకు ఒక్క చిన్న మరక కూడా లేకుండా నేను కానీ, నా కుటుంబం కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతతో వ్యవహరిస్తూ వస్తున్నాం..

ఈరోజు ఎవరో సినిమా యాక్టర్, పెయిడ్ ఆర్టిస్టులతో వచ్చి పిచ్చి కూతలు కూసి ప్రజలను రెచ్చగొట్టి విధ్వసం సృష్టించాలని చూస్తున్నారు, దయచేసి ప్రజలు , అభిమానులు సంయమనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను” అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.