ఉద్యోగస్తులకు శుభవార్త…ఆ ఒక్క పని మానేస్తే బంపర్ బొనాంజా!

వాస్తవం ప్రతినిధి: పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలిసినా కూడా చాలా మంది పొగత్రాగడం మానరు. నికోటిన్ ఆరోగ్యానికి చెడు కలిగిస్తుందని తెలిసినాకూడా చాలా మంది పొగత్రాగడాన్ని మానరు. అలాంటి పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమే. పొగతాగే అలవాటు ఉన్నవారికి క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదమే కాదు, నిద్రకూడా సరిగ్గా పట్టదని న్యూయార్క్ లోని రోచెస్టర్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ, వైద్య విభాగంలో పని చేస్తున్న సైంటిస్ట్ ఇర్ఫాన్ రెహ్మాన్ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. నిజానికి పొగత్రాగడం మగవారికి మాత్రమే కాదు వారి పిల్లలకు కూడా ప్రమాదమే. వారు పొగత్రాగడం వల్ల పిల్లలను ఆస్త్మాఆవహించే అవకాశాలు మూడు రేట్లు ఎక్కువగా ఉంటాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఇది తెలిసీ చాలా మంది పొగత్రాగడం మానేద్దాం.. మానేద్దాం.. అనుకుంటూనే.. దానిని కొనసాగిస్తున్న వారెందరో ఉన్నారు. పొగ తాగే అలవాటుకు సాధ్యమైనంత తొందరగా ఆపకపోతే అది చివరకు మన ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. పొగతాగడమనేది ఆరోగ్యానికి హానికరం. ధూమపానానికి బానిసలై ఎంతోమంది బలైపోతున్నారు. ఐతే ప్రభుత్వాలు కూడా స్మోకింగ్‌ ఈజ్‌ ఇంజ్యూరియస్‌ టూ హెల్త్‌ అని ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతాయి. కానీ జపాన్‌లోని ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల ఆరోగ్యమే..సంస్థకు మహాభాగ్యమని వినూత్న ఆలోచన చేసింది. తమ కంపెనీ ఉద్యోగులు ఎవరైతే స్కోకింగ్ చేయరో వారికి ఆరు రోజులు అదనంగా సెలవు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. టోక్యో ప్రధానకేంద్రంగా పనిచేసే పియల ఇంక్ అనే సంస్థ ఓ ఉద్యోగి ఫిర్యాదు అనంతరం ఈ పాలసీని తీసుకొచ్చింది. అయితే, ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. ఈ సంస్థ కార్యాలయం 29వ అంతస్థులో ఉంది. ఈ భవనం లోపల స్మోకింగ్ చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. దీంతో ఉద్యోగులంతా కిందికెళ్లి సిగరెట్ తాగుతున్నారు. దీనిపై ఆ ఉద్యోగి తమ యజమాన్యానికి ఫిర్యాదు చేశారు.

ఉద్యోగులు కిందికి వెళ్లి సిగరెట్ తాగిరావడానికి సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతోంది. దీంతో విలువైన సమయం వృథా అవుతోంది. ఇలా సిగరెట్ తాగేందుకు వెళ్లేవారి వల్ల సిగరెట్ తాగని ఉద్యోగులపై పనిభారం పడుతోంది అని ఆ ఉద్యోగి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీన్ని చూసిన సీఈవో స్మోకింగ్‌ చేయని వారికి 6 అదనపు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. వెంటనే ఈ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ విధానం అమలులోకి వచ్చింది. ఇప్పటికే కొంతమంది ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో కంపెనీ తమ స్వార్థం గురించి ఆలోచించినా.. ఈ ఆఫర్ వల్ల ఉద్యోగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందనే ఆనందం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఇటు కంపెనీకి ప్రయోజనం..అటు ఎంప్లాయ్‌ హెల్త్‌..ఇలా రెండు రకాలా లాభమేనని కొనియాడుతున్నారు.