సింగపూర్‌లో ప్రవాస భారతీయుడు అరెస్ట్‌

వాస్తవం ప్రతినిధి: భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది.

భారతీయులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులు ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఇదే పని చేసినందుకు సింగపూర్‌లో నివశిస్తున్న శివశరవణన్ సప్పియా మురుగన్ అనే ప్రవాసీ మాత్రం జైలుపాలయ్యాడు. వివరాలోకి వెళ్ళితే ఈఏడాది అక్టోబర్‌27న సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియా ప్రెసింక్ట్‌ ప్రాంతంలో మురుగన్‌ బాణాసంచా పేల్చారు. సింగపూర్ చట్టాల ప్రకారం, ఎవరూ ప్రమాదకరమైన బాణాసంచాను ఉపయోగించకూడదు. ఈ విషయం తెలియని మురుగన్…అక్టోబరు 27 దీపావళి రావడంతో అర్థరాత్రి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నాడు. సింగపూర్‌ చట్టాల ప్రకారం సమస్యాత్మక ప్రాంతాల్లో బాణాసంచా పేల్చి ప్రజలను ఇబ్బంది పెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వచ్చి అతన్ని అరెస్టు చేశారు. కోర్టు కూడా మురుగన్ చేసింది తప్పేనని పేర్కొంది. ఈ కేసులో దోషిగా తేలినట్టయితే అతనికి రెండేండ్ల జైలుశిక్ష, 7,306 డాలర్ల (రూ.5,23,303 ) జరిమానా విధించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తాను తప్పు చేయలేదని, బెయిల్‌పై విడుదల చేయాలని మురుగన్‌ న్యాయమూర్తిని అభ్యర్థించాడు. మురుగన్‌ అభ్యర్థనలపై 3,654 డాలర్ల (రూ.2,61,723) పూచీకత్తుపై కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 31న తీర్పు వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.