డాలస్ లో ఘనంగా నాట్స్ 9వ బాలల సంబరాలు

వాస్తవం ప్రతినిధి: “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అంటూ ఖండాంతరాలు దాటినను అమెరికాలో వున్న తెలుగు వారందరిని ఏకం చేస్తూ.. మన భారతీయ సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ప్రతి యేటా చేసే వేడుకలు భావి తరాలు గుర్తుంచుకునేలా చేస్తోంది “నాట్స్”. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆవిర్భవించినప్పటి నుండి “భాషే రమ్యం, సేవే గమ్యం” దిశగా పయనిస్తూ… భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, ప్రతి యేటా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది “నాట్స్” అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్…డాలస్ లో ఘనంగా బాలల సంబరాలను నిర్వహించింది. ప్రతి యేటా ఓ సంప్రదాయంలా నిర్వహించే ఈ నాట్స్ బాలల సంబరాలకు డాలస్ లోని కూడి అకాడమీ ఆడిటోరియం వేదికగా మారింది. అమెరికాలో తెలుగుజాతికి తమ విశిష్టసేవలతో దగ్గరైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) వారి డాలస్ చాప్టర్, వరుసగా తొమ్మిదవ సంవత్సరం బాలల సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించింది. ఇప్పటి వరకు వరుసగా ఎనిమిది సంవత్సరాలు బాలల సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బాలల సంబరాల్లో వందలాది చిన్నారులు తమ ప్రతిభ చూపారు. దాదాపు పన్నెండు గంటలపాటు జరిగిన ఈ సంబరాలలో భారత దేశ సంస్కృతిని, పిల్లలలోని మేధస్సును ప్రోత్సహించే దిశగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది బాల బాలికలు గణితం, చదరంగం మరియు తెలుగు పదకేళి పోటీలలో ఎంతో ఉత్సాహాంతో పాల్గొన్నారు. ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, సీనియర్ స్కూల్ పిల్లలకు విడిగా నిర్వహించిన ఈ పోటీల్లో పిల్లలు తమ ప్రతిభను చాటారు.

సాఫ్ట్ స్కూల్స్ తరఫున గూడవల్లి మణిధర్ పిల్లలకు గణితంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. USCF స్థానిక చాఫ్టర్ సహకారంతో నిర్వహించిన చదరంగం పోటీలో 90 మంది పిల్లలు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంచేందుకు వారిని ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాలు నిర్వహిస్తుందని నాట్స్ ఉపాధ్యక్షులు శేఖర్ అన్నే ఆన్నారు. నాట్స్ చేసే వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించి అందరిని భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరారు. ఇతర వక్తలు మాట్లాడుతూ ప్రవాసాంద్రుల పిల్లల కొరకు నాట్స్ చేస్తున్ని సేవలను ప్రశంసించారు. డాలస్ విభాగ కార్యదరి అశోక్ గుత్తా,కిషోర్ వీరగంధం ఈ పోటీలను సమన్వయపరిచారు. విభాగ కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి మండల, ప్రేమ్ కలిదిండి ,భాను లంక, కృష్ణ వల్లపరెడ్డి,శ్రీధర్ న్యాలమడుగుల, కిరణ్ జాలాది, దేవీప్రసాద్, విజయ్ కొండా, వెంకట్ పోలినీడు,వెంకట్ కొయలమూడి, నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కిషోర్ కంచర్ల, రాజేంద్ర మాదాల, ఆది గెల్లి, జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, కిషోర్ వీరగంధం, జ్యోతి వనం తదితరులు పాల్గొన్నారు. స్థానిక సాఫ్ట్ స్కూల్స్.కామ్, స్పార్కల్స్ మరియు బావార్చి బిర్యానీ పాయింట్ తగిన సహకారాన్ని అందించారు.