ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు..న్యూజిలాండ్‌ డ్రా

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టును న్యూజిలాండ్‌ డ్రా చేసుకుంది. దీంతో 1-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 96/2తో మంగళవారం చివరి రోజు ఆట కొనసాగించిన కివీస్‌.. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోయేసరికి 241/2తో నిలిచింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (104; 234 బంతుల్లో 11క్ష్4), రాస్‌ టేలర్‌(105; 186 బంతుల్లో 11క్ష్4, 2క్ష్6) అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో రెండో టెస్టు డ్రాగా ముగిసింది.

తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 375 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం రోరీ బర్న్స్‌(101), కెప్టెన్‌ జో రూట్‌(226) అద్భుతంగా రాణించడంతో ఇంగ్లాండ్‌ 476 పరుగులు చేసింది. సోమవారం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి 96/2తో నిలిచింది. కాగా, తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.