అప్పటివరకు వెయిట్ చేస్తా అంటున్న పవన్ కళ్యాణ్ ..!

వాస్తవం ప్రతినిధి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన చాలా ఆసక్తికరంగా మారింది. పర్యటనలో భాగంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ కార్యకర్తలను నాయకులను ఆలోచనలో పడేసాయి. విషయంలోకి వెళితే తిరుపతిలో కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ …ఒక ఊళ్లో 150 మంది జనసేన పచ్చబొట్టు పొడిపించుకున్నారు కాని పార్టీకి ఒక్క ఓటు మాత్రమే వచ్చిందని ఆయన వెల్లడించారు. ఆయన మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకోవడానికి తిరుపతి వచ్చినప్పుడు నేను నేర్చుకున్న జీవిత పాఠం ధర్మో రక్షతి రక్షిత:. నేను ధర్మాన్ని మాత్రమే నమ్ముతాను. నా దగ్గర వేట కొడవళ్లు లేవు, బాంబులు లేవు. ధైర్యం, జ్ఞానం అనే ఖడ్గాలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. 150 మంది పచ్చ బొట్లు పొడిపించుకున్నఊర్లో ఒక్క ఓటు పడింది అంటే అర్ధం ఏంటి? అక్కడ ఏదో తప్పు జరిగి ఉండాలి. నేను వేల కోట్లు సంపాదించి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. చాలా పెద్ద పెద్ద వారు పార్టీలోకి వస్తామని చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. భావితరాల భవిష్యత్తు కోసం వచ్చిన నేను మిగిలిన పార్టీల మాదిరి ఆశయం లేని వ్యక్తులను పక్కన పెట్టుకుంటే నేనేం కొత్తదనం తీసుకురాగలను. పార్టీలో ఉన్న కొంతమంది దెబ్బ కొడతారు అని తెలుసు, వెనుక ఏమేం మాట్లాడుతారు అనే విషయం కూడా తెలుసు. అయినా ఎందుకు భరిస్తాను అంటే చొక్కా నలగకుండా కోట్లు సంపాదించగలిగే వ్యక్తి ఎందుకోసం తపనపడుతున్నాడన్న ఆలోచన మీలో రావాలి. అప్పటి వరకు నేను వేచిచూస్తా.అని పవన్ కళ్యాణ్ అన్నారు.