ఉల్లికోసం ప్రజలు పడుతున్న కష్టాలు ప్రభుత్వ వైఫల్యమే: పవన్‌ కల్యాణ్‌

వాస్తవం ప్రతినిధి: ఈ రోజు తిరుపతి రైతు బజార్‌లో ఉల్లి రైతులతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. అక్కడ ఉల్లిపాయల కోసం ప్రజలు బారులు తీరి నిలబడి ఉండడాన్ని చూసి, వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేదని రైతులు పవన్‌కు మొరపెట్టుకున్నారు. ఉల్లికోసం ప్రజలు పడుతున్న కష్టాలు ప్రభుత్వ వైఫల్యమేనని పవన్ ఈ సందర్బంగా విమర్శించారు. ప్రణాళికలు రచించడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత మాదిరిగానే ఉల్లి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థత లేకపోతే తప్పుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పెరిగిన ఉల్లి ధరలతో మధ్యవర్తులే లాభపడుతున్నారని… రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారన్నారు.

ఉల్లి కోసం ప్రజలు రోజంతా వేచిచూసే పరిస్థితి రావడం దారుణమన్నారు. కూల్చివేయడం, కాంట్రాక్టులు రద్దు చేయడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందన్నారు. అన్నింటినీ గత ప్రభుత్వాలపై నెట్టివేయడం సరికాదని… అలా అయితే బ్రిటీష్‌ ప్రభుత్వం వరకు వెళ్తుందని పవన్‌ పేర్కొన్నారు.