నా పై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారు: జగన్

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రంలో పాలనపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ సీ ఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించిన జగన్ అనంతరం మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తన మతం, కులంపై వస్తోన్న ఆరోపణలు చూసి బాధేస్తోందన్న జగన్.. ‘‘నా మతం మానవత్వం.. నా కులం మాట నిలుపుకునే కులం’’ అని అన్నారు.
తన మేనిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తున్నానని.. మంచి పరిస్థితిని చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో అనారోగ్యం కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకూడదన్నది తన అభిమతమని జగన్ అన్నారు. ఆరోగ్య విభాగంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను మే నాటిని భర్తీ చేస్తామని.. జనవరి నుంచి కేన్సర్ రోగులకు సంబంధించి అన్ని రకాల చికిత్సకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని ఈ సందర్బంగా సీ ఎం జగన్ వెల్లడించారు.