మెక్సికోలో రెచ్చిపోయిన డ్రగ్స్‌ మాఫియా…విల్లా యునియన్‌ నగరంపై మెరుపుదాడి!

వాస్తవం ప్రతినిధి: మెక్సికోలో డ్రగ్స్‌ మాఫియా బీభత్సం సృష్టించింది. మెక్సికో సరిహద్దులోని విల్లా యునియన్‌ నగరంపై మెరుపుదాడికి పాల్పడింది. మెక్సికో గవర్నర్‌ రికల్మే తెలిపిన వివరాల ప్రకారం..గత కొద్ది రోజుల నుంచి డ్రగ్స్‌ మాఫియాకు వ్యతిరేకంగా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారని, అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో మెక్సికో సరిహద్దులోని విల్లా యునియన్‌ నగరంపై దుండగులు మెరుపుదాడికి పాల్పడ్డారు. దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీస్‌ అధికారులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మెక్సికో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో 10 మంది దుండగులు హతమైనట్టు అధికారులు తెలిపారు. మెక్సికో నగర మేయర్‌ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. మెక్సికో అధ్యక్షుడిగా ఆండ్రీస్‌ ఆబ్రేడర్‌ మార్క్స్‌ గతేడాది ఎన్నికయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్‌ మాఫియా ఆగడాలు పెరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫెడరల్‌ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం…ఈఏడాది అక్టోబర్‌31నాటికి మెక్సికోలో 29.414 హత్యలు జరిగాయి. గతేడాది 28,869 హత్యలు జరిగాయి. నేరాలను అదుపు చేయడంలో మెక్సికో సర్కారు విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.