ఇజ్రాయిల్‌లో నిరసనల హోరు.. ప్రధాని రాజీనామాకు డిమాండ్‌!

వాస్తవం ప్రతినిధి: ఇజ్రాయిల్‌లో ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ అవకతవకలకు పాల్పడ్డారని, ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నేత తమకు కావాలంటూ నిరసనకారులు టెల్‌అవీవ్‌ వీధుల్లోకి చేరుకొని ప్లకార్డులు, ఇజ్రాయిల్‌ జాతీయ పతాకాలను చేబూని నెతన్యాహూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీలో దాదాపు 5వేల మంది పాల్గొన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, నెతన్యాహూ మాత్రం తాను అవినీతికి పాల్పడలేదని చెబుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఇజ్రాయిల్‌లో ఈ ఏడాది రెండు సార్లు పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ కూడా స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాలని అధికార లికుడ్‌ పార్టీ నేత నెతన్యాహూ ఆకాంక్షిస్తున్నారు. ఇతర పార్టీలను కలుపు కొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమ య్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తుది గడువు ఈనెల11తో ముగియనుంది. ఈ సారి కూడా ప్రభుత్వ ఏర్పాటు జరగనట్టయితే మూడోసారి పార్లమెంట్‌ ఎన్నికలు జరిగే అవకాశముంది. అంతేగాకుండా, మాజీ విద్యాశాఖ మం త్రి, మితవాద లికుడ్‌ పార్టీ నేత గిడోన్‌ సర్‌ ప్రభుత్వ ఏర్పాటు జరగకుండా కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో నెతన్యా హూ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.