అమెరికాలో అధ్భుతం..24గంటల్లో లక్షాధికారిగా మారిన అమ్మాయి!

వాస్తవం ప్రతినిధి: అదేదో సినిమాలో చెప్పినట్టు…అదృష్టం ఎప్పుడు, ఎలా, ఎవర్ని వరిస్తుందో తెలియదనేందుకు మరో ఉదాహరణ ఇది! అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం మెకానిక్స్‌ విల్లే ప్రాంతానికి చెందిన ఓ యువతి తన బిజినెస్‌ పార్ట్‌నర్‌తో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. ఓ లాటరీ షాప్‌కు వెళ్లి టిక్కెట్టు కొనుగోలు చేసి, తరువాత తన పార్ట్‌నర్‌తోనూ ఒక టిక్కెట్టు కొనిపించింది. ఆయాచిత ఆదాయంపై నమ్మకం లేని పార్ట్‌నర్‌ ఆమె మాట కాదనలేక టిక్కెట్టు కొన్ని వెంటనే దాన్ని అక్కడే విసిరిపారేశాడు. అయితే, సదరు యువతి తన కొన్న టిక్కెట్టుతో పాటు స్నేహితుడి టిక్కెట్టును కూడా సేకరించి జాగ్రతపరిచింది. ఆ రెండు టిక్కెట్లకు జాక్‌పాట్‌ తగలడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. ఒకే రోజు రెండు లాటరీల్లో నగదు బహుమతి రావడంతో ఇరవై నాలుగు గంటల్లో ఆమె లక్షాధికారిగా మారిపోయింది. ముందుగా తన పార్ట్‌నర్‌ టిక్కెట్టుకు రూ.8.54 లక్షలు (12 వేల డాలర్లు) బహుమతి వచ్చినట్టు తెలియడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయిపోయింది. అనూహ్యంగా తాను కొన్న టిక్కెట్టుకు మరో రూ.11.40 లక్షలు వచ్చాయని తెలియడంతో ఆమె ఆనందానికి అవధులే లేవు. తనకు వచ్చిన ఈ రూ.20 లక్షలని స్నేహితుడితో, స్నేహితురాలి తో పంచుకుంటానని యువతి చేప్పింది. ఉదయం వచ్చిన డబ్బును స్నేహితుడితో పంచుకుంటానని, సాయంత్రం వచ్చిన డబ్బు స్నేహితురాలి కుమార్తె పెళ్లికోసం ఖర్చుచేయనున్నట్టు జాక్ పాట్ సాధించిన యువతి తెలిపింది.