ప్రియాంక హత్యోదంతం పై స్పందించిన ప్రవాసులు

వాస్తవం ప్రతినిధి: మధ్యం మత్తులో నలుగురు మృగాళ్లు డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది. నిందితులని ఉరి తీయాలంటూ దేశమంతా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. న్యాయం కోసం నిరసన జ్వాలలు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ చేస్తున్న కొవ్వత్తుల ర్యాలీలు దేశం దాటి అమెరికాను కూడా చేరాయి. వెటర్నరీ యువ వైద్యురాలు డా.ప్రియాంక రెడ్డిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టిన మానవ మృగాలు నలుగురినీ ఉరి తీయాలని అమెరికాలోని ప్రవాసులు పెద్ద గొంతుకతో కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రవాసంలో మాతృదేశాలకు దూరంగా ఉండే తమలాంటి వారిని ఇలాంటి వార్తలు కలవరపెట్టడమే గాక మానసికంగా కుంగుబాటుకు గురి చేస్తున్నాయని, అలాంటిది ప్రియాంక కుటుంబంలో నెలకొన్న అలజడిని రూపుమాపే ఏకైక మందు నిందితులను ఉరితీయడమేనని ప్రవాసులు ఆకాంక్షిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలు.. హైదరాబాద్ ఘటన గురించి తెలుసుకొని చలించిపోయారు. డాక్టర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆటా ఆధ్వర్యంలో అట్లాంటాలో, న్యూజెర్సీలో, డల్లాస్‌లో పలు తెలుగు సంఘాలు కొవ్వొత్తులతో ప్రియాంకకు నివాళులు అర్పించనున్నారు. డాక్టర్ ప్రియాంక హత్యోదంతం ఘటనను ఖండించే ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కార్యక్రమ ప్రతినిధులు పిలుపునిచ్చారు.