‘దిశ ‘ ఘటనపై లోక్ సభలో మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ లో దారుణ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ ఘటన ఉదంతం పార్లమెంట్ లోనూ ప్రతిధ్వనించింది. లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దిశ హత్యాచార ఘటనపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా జీరో అవర్‌లో చర్చిద్దామని సభ్యులకు తెలిపారు. దీంతో క్వశ్చన్‌ అవర్‌ను రద్దు చేసి వెంటనే దిశ రేప్‌ ఘటనపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు.

ఈ మేరకు మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పార్లమెంట్ ఎంపీలతో ఈ ఘటనను ఖండించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అన్ని పార్టీలు అంగీకరిస్తే చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమని రాజ్ నాథ్ ప్రకటించారు.

ఇక తెలంగాణకే చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ పై ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని.. పోలీసులు ఇలాంటి ఘటనల్లో చురుకుగా పనిచేయాలని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఘటనలపై కేంద్రం సీరియస్ గా ఉందని.. కఠిన చట్టం చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు.