అప్పటిదాకా జగన్ ని ముఖ్యమంత్రి అని సంబోధించను అంటున్న పవన్ కళ్యాణ్..!

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రాయలసీమ పర్యటన చేపట్టడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా కడప జిల్లా రైల్వేకోడూరులో పర్యటించిన పవన్ కళ్యాణ్ కి ఆ ప్రాంతంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇదిలావుండగా సభావేదికపై పవన్ కళ్యాణ్ ప్రసంగించిన ప్రసంగం అక్కడ ఉన్న ప్రాంత ప్రజలను ఎంతో ఉత్తేజపరిచింది. ఓడిపోయిన నాకు ఇటువంటి స్వాగతం దొరకటం అనుకుంటే ఆశయం ఉన్న వ్యక్తికి గెలుపు-ఓటములు పెద్ద సమస్య కాదని మరోసారి తెలుసుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొంతమంది వైసీపీ పార్టీ నేతలు జగన్ ని ముఖ్యమంత్రి అని పిలవకుండా జగన్ రెడ్డి అంటూ నేను పిలవడాన్ని తప్పు పడుతున్నారు, వారికోసం క్లారిటీ ఇస్తాను అంటూ పవన్ కళ్యాణ్… ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తే నేను కూడా గౌరవం ఇచ్చి మాట్లాడతాను . లేకపోతే నేను జగన్ రెడ్డి అని పిలుస్తాను, పిలుస్తూనే ఉంటాను అని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడంతో అక్కడ ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తమ కరతాళధ్వనులతో సభను హోరెత్తించారు. ఇదే క్రమంలో సీఎం జగన్ తన స్వార్థం కోసం కేంద్రంలో రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అంతేకాకుండా త్వరలో రైల్వేకోడూరులో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.