ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ అరాచకం ప్రారంభమైంది: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ అరాచకం మొదలైందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ…ఇది విధ్వంసక ప్రభుత్వం తప్ప, ప్రజాప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం కాదని విమర్శించారు. తమపై అక్రమంగా పెట్టిన కేసుల గురించి కచ్చితంగా నిలదీస్తామని చెప్పారు. అనవసరంగా రెచ్చిపోయి తమపై కేసులు బనాయించొద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై ఇప్పటివరకు 690 దాడులు జరిగాయన్నారు. మనం ఓ విచిత్రమైన సీఎంను చూస్తున్నామన్నారు. ఏపీలో ఇసుక ధర ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదన్నారు. బెంగళూరు, హైదరాబాద్ కు ఇసుక తరలిపోతోందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ ప్రజలకు భారంగా మారిందన్నారు.