ప్రియాంక రెడ్డి అత్యాచారంపై స్పందించిన సీఎం కేసీఆర్..!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో జరిగిన ప్రియాంక రెడ్డి అత్యాచార ఘటనపై చాలామంది సెలబ్రిటీలు మరి వివిధ పార్టీల రాజకీయ నేతలు స్పందించి నిందితులకు త్వరగా శిక్ష వేయాలని బహిరంగంగా ఉరి తీయాలని కాల్చి పారేయాలని అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలని సోషల్ మీడియాలో వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. జరిగిన ఘటన చాలా ఆవేదన వ్యక్తం చేసిందని ఇది దారుణమైన అమానుషమైన దుర్ఘటన అంటూ కేసీఆర్ బాధపడ్డారు. అంతేకాకుండా రాత్రిపూట మహిళా అధికారులకు డ్యూటీలు వేయవద్దని అధికారులకు చెప్పినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

అంతేకాకుండా మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని.. మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తమ మొబైల్‌ ఫోన్‌లో డయల్ 100 నెంబర్ తప్పక ఉండాలని సూచించారు. ప్రియాంక రెడ్డి హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

ఇటీవల వరంగల్ లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రియాంక రెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా ప్రియాంక రెడ్డి అత్యాచారం కేసును…జిస్టిస్ ఫర్ దిషాగా పేరు మార్చినట్లు…సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.