ప్రియాంక రెడ్డి విషయం గురించి మోడీనే రిక్వెస్ట్ చేసిన కేటీఆర్..!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం ఘటన వార్త విని దేశం మొత్తం షాక్ అయింది. ఈ ఘటనపై చాలామంది సెలబ్రిటీలు మరియు వివిధ పార్టీల రాజకీయ నేతలు దోషులను కఠినంగా శిక్షించాలని ఎవరికి వారు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వస్తున్న తరుణంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రియాంక రెడ్డి విషయంపై ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి మోడీ ని రిక్వెస్ట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశంలో నిర్భయ లాంటి ఘటన జరిగి ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఆ నిందితులకు ఉరిశిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇటీవలే 9 నెలల పసిపాప పై అత్యాచారం జరిగిందని, దిగువ కోర్టు ఉరిశిక్ష విధించాలని ఆదేశించిందని ఆయన అన్నారు. అయితే.. హైకోర్టు దీనిని కఠిన యావజ్జీవ జైలు శిక్షగా మార్చిందని పేర్కొన్నారు.

కాగా.. హైదరాబాద్‌లో యువ వైద్యురాలు దారుణంగా.. హత్యాచారానికి గురైన విషయాన్ని.. ఆయన ప్రస్తావిస్తూ.. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలంటూ.. పీఎంని అభ్యర్థించారు. ఆ కుటుంబానికి ఎలా ఊరటనిస్తామని అన్నారు. న్యాయం విషయంలో జాప్యం జరిగే కొద్దీ.. న్యాయం జరగనట్టే అన్న విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున.. ఈ సమస్యను తక్షణమే ప్రాధాన్యతా ప్రాతిపదికపై చర్చకు చేపట్టాలని కోరారు. కొత్త చట్టాలు తీసుకురావాలని కఠిన శిక్షలు పడేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ప్రస్తుతం ఉన్న శిక్షలు అంటే భయం లేని ఈ సమాజానికి భయం వేసే విధంగా సరికొత్త శిక్షలతో కూడిన చట్టాలు తీసుకురావాలని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా ఇదే కోరుతుందని మోడీ కి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.