అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సెలవు వారాంతం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్(26), జూడీ స్తాన్లీ(23)లు దుర్మరణం పాలయ్యారు. వైభవ్ టెన్నిస్సీ స్టేట్ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తుండగా జూడీ ఎంఎస్ చేస్తున్నారు. నోలెన్స్‌విల్ పైక్ వద్ద వాల్‌మార్ట్ నుండి వైభవ్, జూడీ ప్రయాణిస్తున్న నిస్సాన్ సెంట్రా కారును డేవిడ్ టొర్రెస్(26) అనే వ్యక్తికి చెందిన ట్రక్కు ఢీకొట్టగా బాధితుల కారు తునాతునాకులు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని డేవిడ్ టొర్రెస్‌గా గుర్తించారు.పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జూడీ, వైభవ్‌లను భారతదేశానికి తరలించేందుకు అక్కడి భారతీయ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. వారి మిత్రులు మృతదేహాలను స్వదేశాలకు తరలించేందుకు ‘GoFundMe’ ద్వారా నిధుల సేకరణ నిర్వహిస్తున్నారు. వీరి మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.